latest telugu news updates

Latest telugu news updates:రూ.40 కోట్లతో ఏర్పాటు
మెరీనా బే తరహాలో రూపకల్పన
8.38 ఎకరాల కేటాయింపు
వెంకటపాలెం వద్ద కృష్ణా ఒడ్డున లాహిరి..లాహిరిలో

నవ్యాంధ్ర రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా ఓ నూతన ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. సింగపూర్‌లోని మెరీనా బే తరహాలో వెంకటపాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో అమరావతి మెరీనా పేరుతో ప్రత్యేక రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కరకట్ట నుంచి కృష్ణా నది వైపు 8.38 ఎకరాలను కేటాయించింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని జల సంబంఽధిత క్రీడలతో పాటు పలు రీజనల్‌, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించేందుకు అనువుగా అభివృద్ధి చేస్తారు.

(మంగళగిరి): ప్రపంచంలోని నాలుగు చెరగులా వున్న ప్రత్యేక ఆకర్షణలకు నెలవుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపుదిద్దుకోనుంది. అమరావతికి సెంట్రల్‌ పార్కు ఓ ప్రత్యేక హరితాభరణం కానుండగా.. రాజధానికి 25 కిలోమీటర్ల పొడవున వుండే కృష్ణాతీరాన్ని పలురకాల పార్కులు, గ్రీనరీలతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సీడ్‌ క్యాపిటల్‌కు ఉత్తర ఈశాన్యంలో వెంకటపాలెం వద్ద అందమైన రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రపంచంలో అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్న సింగపూర్‌లోని మెరీనా బే తరహాలో వెంకటపాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో అమరావతి మెరీనా పేరుతో ప్రత్యేక రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపడుతోంది. ఇందుకోసం వెంకటపాలెం వద్ద కరకట్ట నుంచి కృష్ణానది వైపు 8.38 ఎకరాలను కేటాయించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను కూడ ప్రభుత్వం చేపట్టింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా టెండర్లను ఖరారు చేసే అవకాశం వుంది. ఏపీ సీఆర్డీయే ఆఽధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. డీబీఎఫ్‌వోటీ విధానంలో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో రెండు దశలుగా పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసమై ప్రభుత్వం మొత్తం 8.38 ఎకరాలను కేటాయించింది. ఇందులో 7.38 ఎకరాలను కరకట్ట నుంచి కృష్ణానదివైపు, మరో ఎకరాన్ని కరకట్టకు ఈవలివైపు కేటాయించారు. తొలిదశ పనులను ఏడాదిలోగా, రెండోదశ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా బోటింగ్‌ కేంద్రం వుంటుంది. లాంచింగ్‌ స్టేషన్‌లో నాలుగు రకాలైన బోట్లు ఇరవై వరకు అందుబాటులో వుంటాయి. ఈ ప్రాంతాన్ని జల సంబంఽధిత క్రీడలతో పాటు పలు రీజనల్‌, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించేందుకు అనువుగా అభివృద్ధి చేస్తారు. వీటితోపాటు రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులను ఏర్పాటుచేస్తారు. ఈ ప్రాజెక్టును కాంట్రాక్టు సంస్థ 33 ఏళ్లపాటు సొంతంగా నిర్వహించుకోవచ్చు. లీజు పీరియడ్‌ ముగిశాక సీఆర్డీయేకు తిరిగి అప్పగించాల్సివుంటుంది. సీఆర్డీయే నుంచి లీజుకు తీసుకున్న 8.38 ఎకరాల భూమికిగాను ఎకరాకు ఏడాదికి రూ.లక్ష వంతున ఏటా ఐదుశాతం పెంపుదలతో కాంట్రాక్టు సంస్థ చెల్లించాల్సివుంటుంది.

భారీ కన్వెన్షన్‌ సెంటరు
ఈ ప్రాజెక్టుతోపాటు వెంకటపాలెం వద్దే ప్రభుత్వం మరో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటరును నిర్మించబోతుంది. ఆరువేల సీటింగ్‌ సామర్ధ్యంతో కూడిన కన్వెన్షన్‌ సెంటరుతో పాటు అమరావతిని సందర్శించే విదేశీ పర్యాటకుల సౌకర్యార్ధం ఐదు నక్షత్రాల హోటళ్లు మూడింటిని నిర్మించాలని సీఆర్డీయే ప్రణాళికలను రూపొందించింది. దీనికితోడు ఓ పెద్ద షాపింగ్‌మాల్‌ను కూడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే మరో నాలుగు వరకు ఐటీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇవన్నీ వెంకటపాలెం – మందడం మధ్య వున్న సీడ్‌ యాక్సిస్‌ రహదారి-కృష్ణా కరకట్ట మధ్యన ఏర్పాటు కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here