latest telugu news updates

పూర్తి బాధ్యత వహిస్తున్నా
‘బాల్‌టాంపరింగ్‌’ నన్ను జీవితాంతం వదలదు
క్షమించండి… తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చా
మీడియా ఎదుట బోరుమన్న స్టీవ్‌ స్మిత్‌
స్టీవ్‌ స్మిత్‌ బోరుమన్నాడు.. తాను తప్పు చేశానంటూ చిన్నపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు! బాల్‌టాంపరింగ్‌ ఘటనలో ఎవరినీ నిందించే ఉద్దేశం తనకు లేదని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నానన్నాడు. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో ఆ దారుణ చేష్ట జట్టు నాయకుడిగా తన వైఫల్యాన్ని చాటిందనీ, తన కీర్తిప్రతిష్ఠలు మంటగలిసి పోయాయని మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటన తనను జీవితాంతం వెంటాడుతుందన్న స్మిత్‌.. జట్టు సభ్యులు, అభిమానులు తనను క్షమించాలని వేడుకున్నాడు.

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో చోటుచేసుకున్న బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత తనదేనని ఆస్ర్టేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. ఈ ఉదంతంలో క్రికెట్‌ ఆస్ర్టేలియా (సీఏ) స్మిత్‌ను ఏడాదిపాటు బహిష్కరించడంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలగిన స్మిత్‌ సిడ్నీ చేరుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడాడు. ఐదు నిమిషాలే సమావేశంలో పాల్గొన్న స్మిత్‌ అంతసేపూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. చేసిన తప్పునకు ఎంతో చింతిస్తున్నానని చెప్పాడు. ఈ ఘటన తనను జీవితాంతం బాధిస్తుందన్నాడు. ‘జరిగిన పొరపాటుకు ఆస్ర్టేలియా జట్టు సారథిగా నేను పూర్తి బాధ్యత వహిస్తున్నా. నిర్ణయం తీసుకోవడంలో పెద్ద పొరపాటు చేశా. దాని పర్యవసానాలు ఇప్పుడు అర్థమయ్యాయి. నా నాయకత్వ తప్పిదమది’ అని స్మిత్‌ కన్నీరుమున్నీరయ్యాడు. ‘నా తప్పును సరిదిద్దుకొనేందుకు కావాల్సినవన్నీ చేస్తాను. దీనివల్ల ఏదైనా మంచి జరిగిందంటే అది.. ఇతరులు తన తప్పునుంచి గుణపాఠం నేర్చుకోవడం. క్రికెట్‌లో ఓ మార్పునకు నేను కారణమవుతానని భావిస్తున్నా. మొ త్తంగా జరిగిన పరిణామాలతో నా మనసు తీవ్రంగా గాయపడింది’ అని స్మిత్‌ చెప్పాడు. కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఓ శాండ్‌పేపర్‌తో బంతి ఆకారాన్ని బాన్‌క్రా్‌ఫ్ట దెబ్బతీశాడని సాక్ష్యాధారాలతో వెల్లడైన సంగతి తెలిసిందే. స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించిన క్రికెట్‌ ఆస్ర్టేలియా బాన్‌క్రాఫ్ట్‌ను 9నెలలు సస్పెండ్‌ చేసింది. ‘మళ్లీ నేను మునుపటి గౌరవ మర్యాదలు పొందగలనని ఆశిస్తున్నా. ఆసీస్‌ జట్టు కెప్టెన్‌గా ఉండడం ఎంతో గౌరవంగా భావించా. ప్రపంచంలో క్రికెట్‌ గొప్ప క్రీడ. అది నా జీవితం. మళ్లీ దానిలో ప్రవేశిస్తాననే భావిస్తున్నా’ అని స్మిత్‌ అన్నాడు. బాల్‌ టాంపరింగ్‌లో మరే ఆటగాడి ప్రమే యం లేదని తప్పంతా తనదేనని మరోసారి స్పష్టంజేశాడు. ‘మంచి వ్యక్తులు తప్పు చేస్తారు. ఈ ఘటనకు అనుమతిస్తూ నేను ఘోర తప్పిదానికి పాల్పడ్డా. అందుకు చింతిస్తున్నా. అది పునరావృతం కాదని హామీ ఇస్తున్నా’ అని ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకొంటూ అన్నాడు. ‘వేలెత్తి చూపే నిర్ణయం తీసుకొనేముందు.. ఆ నిర్ణయ ప్రభావం పడే వ్యక్తుల గురించి ఆలోచించాలి. మీ తల్లిదండ్రులు నొచ్చుకొంటారని గుర్తుంచుకోండి. నా విషయమే తీసుకోండి.. నేను చేసిన పని నా తల్లిదండ్రులను ఎంతో వేదనకు లోనుచేసింది. అందుకు క్షమించాలని వాళ్లను వేడుకుంటున్నా. అంతేకాదు ఆస్ర్టేలియా ప్రజలందరినీ నా చర్యలతో నొప్పించాను. అందుకు క్షమించండి’ అని విలేకరుల సమావేశాన్ని స్మిత్‌ ముగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here