pralayam.com

ఆవేశంతో మాట్లాడే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడే అల‌వాటును కొంత‌కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఫ్యూచ‌ర్ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేయాల‌న్న ఆశ‌తో ఉన్న ఆయ‌న‌.. గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొద‌ట్లో కాంగ్రెస్ నేత‌ల పంచెలు ఊడ‌దీసి కొట్టాలంటూ ఆవేశంతో మాట్లాడిన ప‌వ‌న్‌.. ఇప్పుడు చూస్తే.. తాను మాట్లాడే ప్ర‌తి మాట‌కు ఎంతో సంఘ‌ర్ష‌ణ‌కు గురైన త‌ర్వాతే మాట్లాడ‌తాన‌ని సెల‌విస్తారు. మ‌రి.. మొద‌ట్లో ఆ తెలివి ఏమైంద‌న్న సందేహానికి ఆయ‌న ఎప్పుడూ స‌మాధానం చెప్పింది లేదు.

పార్టీ పెట్టిన త‌ర్వాత కూడా ఆవేశంతో ఊగిపోయేలా వ్యాఖ్య‌లు చేసే ప‌వ‌న్‌.. ఈ మ‌ధ్య‌న మాత్రం త‌న‌ను తానుచాలానే మార్చుకున్నారు. తొంద‌ర‌ప‌డి మాట్లాడ‌టం త‌గ్గించేశారు. ఆవేశం కంటే ఆలోచ‌న‌తో మాట్లాడుతున్న బిల్డ‌ప్ షురూ చేశారు. ఇందులో భాగంగానే త‌న మీద బాబు ఏజెంట్ అన్న ముద్ర వేస్తున్నా.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు త‌ట‌ప‌టాయించే ప‌రిస్థితి. అదేమంటే.. బాబు అనుభ‌వం ఏపీకి ఎంతో అవ‌స‌ర‌మ‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌స్తుంటుంది.

రాజ‌కీయాల్లో ఏం అనుభ‌వం ఉంద‌ని.. పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల‌కే ఎన్టీవోడికి తెలుగు ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన‌ట్లు? ఆ మాట‌కు వ‌స్తే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారిని ఆద‌రించి.. అభిమానించి నెత్తిన పెట్టుకున్న ఉదంతాలు చాలానే క‌నిపిస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా రాజ‌కీయాల్లో అనుభ‌వానికి పెద్ద‌పీట వేయాల‌న్న చిత్ర‌మైన వాద‌న ప‌వ‌న్ నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా ఆ అనుభ‌వం మీద ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. అనుభ‌వానికి పెద్ద పీట అంటూ బాబు త‌ప్పుల్ని ఎత్తి చూప‌కుండా జాగ్ర‌త్త‌ప‌డే ప‌వ‌న్‌.. ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. బాబు అనుభ‌వం మీద ప‌వ‌న్ పంచ్ అదిరింద‌న్న మాట వినిపిస్తోంది. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన అంశాల్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ పైండింగ్ క‌మిటీని ఏర్పాటు చేసి ప‌లు అంశాల మీద అధ్య‌య‌నం చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. తాజాగా ఆ వివ‌రాల్ని వెల్ల‌డించే క్ర‌మంలో చంద్ర‌బాబు మీద చేసిన ప‌వ‌న్ విమ‌ర్శ‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అత్య‌వ‌స‌ర‌మ‌ని.. దాంతో మ‌రేదీ సాటిరాద‌న్న విష‌యం తాజాగా ప‌వ‌న్ నోటి నుంచి రావ‌టం తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే నూటికి నూరుశాతం న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. హోదా సాధ‌న విష‌యంలో చంద్ర‌బాబు క‌న్ఫ్యూజ్ అయ్యార‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా స్థానే.. ప్ర‌త్యేక ప్యాకేజీ అంటే ఓకే చెప్పార‌ని.. ఆ విష‌యంలో బాబు క‌న్ఫ్యూజ్ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిగా మారింద‌న్నారు. అనుభ‌వం ఉన్న వ్య‌క్తి అలా క‌న్ఫ్యూజ్ ఎలా అ్యారంటూ ప‌వ‌న్ వేసిన ప్ర‌శ్న తెలుగు త‌మ్ముళ్ల‌కు ఇబ్బందిగా మారింది. ఇంత‌కాలం త‌మ అధినేత‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉండే ప‌వ‌న ఇప్పడింత సూటిగా త‌ప్పు ప‌ట్ట‌టం తెలుగు త‌మ్ముళ్ల‌ను ఇబ్బందికి గురి చేస్తుంది. ఏమైనా అనుభ‌వం మాట‌తో బాబుపై ప‌వ‌న్ వేసిన పంచ్ అదిరింద‌న్న మాట వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here