latest telugu news updates

అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మిత్రులే ప్రత్యర్థులైన తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నియమితులు కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర శాఖకు సంకేతాలందినట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మెతక వైఖరితో ఉన్నారని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతుండడంతో ఆయన్ను తప్పించి.. సమయానుకూలంగా దూకుడు, సమయస్ఫూర్తి కలిగిన మాణిక్యాలరావును అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీలోని ముఖ్యమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కరెక్టని కొంతకాలంగా భావిస్తున్నారు. ఆ వర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు పేర్లను పరిశీలించారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కన్నాకు ఇప్పుడే బాధ్యతలు అప్పగించడం సబబు కాదనే వాదన వినిపించింది. వీర్రాజు వైపు ఎక్కువ మంది మొగ్గు చూపినా.. ఆయన అత్యుత్సాహంతో నోరుజారుతుంటారని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో మాణిక్యాలరావు మచ్చలేని నిరాడంబరుడు గనుక ఆయనకు అప్పగించడమే సబబని బీజేపీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

రామ్‌మాధవ్‌ వ్యూహమే…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్యాలరావు పేరు ముందుకు రావడంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రామ్‌ మాధవ్‌ పాత్ర కీలకమని తెలుస్తోంది. గత కొంత కాలంగా సోము వీర్రాజు పేరు అధ్యక్ష పదవి రేసులో ప్రచారంలో ఉంది. ఆయన కాకుంటే కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఉండవచ్చనే ప్రచారం కూడా జరిగింది. వీర్రాజుకు కేంద్ర నాయకత్వంతో ఇప్పటికే మంచి సంబంధాలు ఉన్నందున కొన్ని విషయాల్లో రామ్‌మాధవ్‌ను దాటి నేరుగా అమిత్‌ షా వంటి వారిని కలిసే అవకాశముంది. వీటన్నిటినీ బేరీజు వేసుకుని రామ్‌మాధవ్‌ చక్రం తిప్పడంతో మాణిక్యాలరావుకు అవకాశం లభించిందని చెబుతున్నారు. వీర్రాజుకు కేంద్ర కమిటీలో చోటు కల్పిస్తారని సమాచారం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం…
నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికై, అమిత్‌ షా చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్లాక బీజేపీలో ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రత్యక్ష పాత్ర పోషిస్తోంది. ఢిల్లీలో రామ్‌ మాధవ్‌, రాష్ట్రంలో రవీంద్రరాజు.. పార్టీ కార్యాలయం నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. ఆర్‌ఎ్‌సఎ్‌సలో కొన్ని దశాబ్దాలుగా పనిచేస్త్తున్న మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకొనేవారు. కాగా, మాణిక్యాలరావు నియామకం దాదాపు ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర కమిటీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని అధినాయకత్వం భావిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎం, ఏబీవీపీ తదితర సంస్థల్లో పనిచేసిన వారి వైపు పార్టీ పెద్దలు చూస్తున్నారు.

>LATEST TELUGU NEWS UPDATES.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here