pralayam.com

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, స్పెషల్ స్టేటస్ తోనే ఏపీకి న్యాయం జరుగుతుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీకి 100 శాతం న్యాయం జరుగుతందని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ (JFC) కమిటీ బలమైన అభిప్రాయానికి వచ్చిందని పవన్ తెలిపారు. జేఎఫ్‌సీ అందించిన నిజనిర్ధారణ నివేదిక‌లోని వివ‌రాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాకు వివ‌రించారు.

జ‌న‌సేన‌ పార్టీ ఆవిర్భావానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జ‌న చేసిన తీరే కార‌ణమ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. విభ‌జ‌న జ‌రిగిన తీరుకి న‌ష్ట‌పోయి ఆంధ్ర‌ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయిన‌ప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అన్నారని, ఎన్నో హామీలు ఇచ్చార‌ని గుర్తు చేశారు.

ప్రత్యేకహోదా అనే పదాన్ని ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని జనసేనాని మండిపడ్డారు. ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూ అని తాను గతంలో చెప్పానన్న పవన్.. పాచిపోయిన ల‌డ్డూ అయినా తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు అన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కనీసం పాచిపోయిన లడ్డూని కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ఇస్తోన్న సాయం విషయంలో ఏం జ‌రుగుతోందన్న అంశంపై మాత్ర‌మే క‌మిటీ వేశామని తెలిపారు. ఒకసారి ప్యాకేజీని అని.. మరోసారి ప్రత్యేక హోదా అని అంటున్నారని.. అసలు ఇంత కన్ఫూజన్‌ ను ఎందుకు సృష్టిస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

ఏపీలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థల కోసం ఇప్పటికీ నామ మాత్రంగానే నిధులు ఇచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. 5 శాతం మాత్రమే నిధులు ఇచ్చారని, ఇన్నేళ్లలో కేవలం 5 శాతం మాత్రమే ఇవ్వడమేంటని అన్నారు. ఈ తీరు ప్రజలను మరింత ఆసహనానికి, ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జనసేనాని డిమాండ్ చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ పూర్తి చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. పనులకు ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

అలాగే, రైల్వే జోన్‌ పై ఇప్పటివరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పవన్ కల్యాణ్ నిలదీశారు. ఏది అడిగినా అది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని, మరి ఏది సాధ్యం అవుతుందో చెప్పాలని కోరారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకు కూడా విలువ ఇవ్వట్లేదని విమర్శించారు. పరిపాలనా అనుభవం ఉందని, రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీ, టీడీపీకి తాను ఎన్నికల్లో మద్దతు పలికానని పవన్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here