pralayam.com

శ్రీదేవి మరణంతో మీడియా పట్టించుకోలేదు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోది పై చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటైనవి. దేశ ప్రధాని ని పట్టుకుని “మోది గాడు “ అని అనడం ఎవరైనా కచ్చితంగా ఖండించవలసిందే. అదే ఉపన్యాసంలో కెసిఆర్ కేంద్రం వ్యవసాయ మంత్రిని, ఆర్ధిక మంత్రిని “గారు” అనే అన్నారు, అంటే మోదిని పొరపాటున ‘గాడు’ అని అన్నారేమో అని అనుకుంటుంటే, కెసిఆర్ కాంగ్రెస్ బిజెపి లపై నేను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా అని ఆ తర్వాత కూడా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కెసిఆర్ ఎందుకిలా అన్నారు?

ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో కెసిఆర్ నరేంద్రమోది ని పెద్దగా లెక్కచేసింది లేదు కానీ, క్రమేణా మోది కి కెసిఆర్ దగ్గరయ్యారు. డీమానిటైజేషన్, GST ల విషయంలో మోది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కేంద్ర మంత్రులు కూడా కెసిఆర్ పథకాలని పొగుడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ ఇప్పుడు సడెన్ గా మోది మీద ఎందుకు విరుచుకు పడుతున్నారు అంటే…

జాతీయ స్థాయిలో మోది హవా తగ్గుతోంది అని సర్వేలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఈసారి బిజెపి కి లోక్ సభ సీట్లు గణనీయంగా తగ్గుతాయని, 2019 లో బిజెపి కి సొంత మెజారిటీ రాదని, 200 లోపు స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మోది శకం ముగిసినట్లే. మిత్రపక్షాలని కలుపుకోవాలి కాబట్టి సౌమ్యుడు అయిన రాజ్ నాథ్ సింగ్ లేదా వ్యవహారదక్షుడు అయిన నితిన్ గడ్కరీ లలో ఎవరో ఒకర్ని ప్రధానిగా ప్రకటించే అవకాశం ఉంది. బిజెపి కి ఇంకా సీట్లు తగ్గితే మళ్ళీ థర్డ్ ఫ్రంట్ పురుడుపోసుకోవచ్చు. అందుకే కెసిఆర్ మోది పై విరుచుకుపడడం ద్వారా థర్డ్ ఫ్రంట్ కి లీడర్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవచ్చు. లేదా

తెలంగాణ లో కాంగ్రెస్ బలపడుతోంది అని సంకేతాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలలో ఐక్యత లేదు కానీ, వాళ్ళు ఐక్యంగా ఉంటే తెరాస కి గట్టి పోటీ ఇవ్వవచ్చు. సహజంగా కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ గా ఉన్న ముస్లింలను, తనవైపు తిప్పుకోవడం కోసం కెసిఆర్ ప్రభుత్వం తొలినుంచి గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, కెసిఆర్ మోది కి అనుకూలంగా మాట్లాడుతుండడం వల్ల ముస్లింలలో కాస్త అసంతృప్తి ఉంది. దీన్ని పసిగట్టిన కెసిఆర్, మోది ని గట్టిగా తిట్టడం ద్వారా, ఈ వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసి ఉండవచ్చు. బిజెపి కి కూడా తెలంగాణ లో తాము ఎదగకపోయినా పర్లేదు కానీ, కాంగ్రెస్ మాత్రం ఎదగకూడదు కాబట్టి కేసిఆర్ తిట్లపై మౌనంగా ఉండి ఉండొచ్చు.

మోది పై కెసిఆర్ విరుచుకుపడడానికి పై రెండిటిలో ఏదో ఒక కారణమేనా లేక మన ఊహకి అందని మరో కారణం ఉందా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here