LATEST TELUGU NEWS UPDATES:
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: రామ్‌చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ, అజయ్ ఘోశ్, పూజా హెగ్డే, అమిత్ శర్మ, నరేశ్, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
కళ: రామకృష్ణ, మోనిక
కూర్పు: నవీన్ నూలి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం(మోహన్)
రచన, దర్శకత్వం: సుకుమార్
విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. క్యారెక్టరైజేషన్ ఆధారంగా కథను తయారు చేసి సినిమా చేయాలనుకునే ఈ దర్శకుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇక మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్‌చరణ్ నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఇప్పటి వరకు స్టైలిష్ మూవీస్‌ను తనదైన శైలిలో తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్, మాస్ హీరో కలిసి సినిమా చేస్తున్నాడంటే పక్కా కమర్షియల్ సినిమా వస్తుందేమోనని ఆడియెన్స్ ఊహిస్తారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా రూపొందింది. `రంగస్థలం` పేరుతో 1980 బ్యాక్‌డ్రాప్ మూవీ అనగానే సుకుమార్ ఈ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఎందుకు చేయాలనుకున్నాడో.. అసలు ఏం చెప్పాలనుకున్నాడనే ఆసక్తి మొదలైతే.. చరణ్ ఇందులో ఏకంగా పాక్షికంగా చెవులు పనిచేయని యువకుడిగా కనపడతాడని తెలిసి ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఈ అంచనాలను రంగస్థలం అందుకుందా లేదా? అని తెలియాలంటే కథలోకి వెళదాం.
కథ:
రంగస్థలం గ్రామానికి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రెసిడెంట్. ముప్పై ఏళ్లుగా ప్రెసిడెంట్‌గా ఉంటూ ప్రజలకు అందాల్సిన నిధులను కాజేస్తూ ఉంటాడు. సొసైటీ పేరు చెప్పి ఊరి ప్రజలకు అప్పిచ్చి.. వడ్డీ వసూలు చేస్తుంటాడు. ఇవ్వని వారి భూములు స్వాధీనం చేసుకుంటుంటాడు. ఎదురు తిరిగిన వాళ్లని చంపేస్తుంటారు. అదే ఊరికి చెందిన కుమార్‌బాబు(ఆది పినిశెట్టి) దుబాయ్ నుంచి ఊరికొస్తాడు. కుమార్ బాబు తమ్ముడు చిట్టిబాబు (రామ్‌చరణ్)కి పాక్షికంగా చెవుడు. తన మోటారుతో ఊరి పొలాలకు నీరందిస్తుంటాడు. తన వరుసకు మరదలు అయిన రామలక్ష్మి(సమంత)ని ప్రేమిస్తాడు. ఊర్లో జరిగే అన్యాయాలకు కుమార్‌బాబు ఎదురొస్తాడు. దక్షిణామూర్తి (ప్రకాశ్ రాజ్) సపోర్ట్‌తో కుమార్‌బాబు ఊరి ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తాడు. ముందుగా ఊరి ప్రజలు ప్రెసిడెంట్‌కు భయపడ్డా నెమ్మదిగా కుమార్ బాబు అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. అయితే ప్రెసిడెంట్ ఫణీంద్ర.. కుమార్ బాబుని చంపడానికి ప్లాన్ చేస్తారు. మనుషులను పంపుతాడు. అక్కడ జరిగే గొడవ కుమార్ బాబుని చిట్టిబాబు కాపాడిన మరెవరో కుమార్ బాబుని చంపేస్తారు. చిట్టిబాబు తన అన్నను చంపింది ప్రెసిడెంట్ అని అతని ఇంటికి వెళితే అప్పటికే ప్రెసిడెంట్ పారిపోయుంటాడు. దక్షిణామూర్తికి యాక్సిడెంట్ అవుతుంది. కోమాలోకి వెళ్లిపోతాడు.ఇంతకు కుమార్‌బాబుని చంపిందెవరు? చంపించిదెవరు? అని తెలుసుకోవాలంట సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
రామ్‌చరణ్ సహా నటీనటులు
సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
ఆర్ట్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
సినిమా లెంగ్త్ ఎక్కువ కావడం
స్లో నెరేషన్
కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
విశ్లేషణ:LATEST TELUGU NEWS UPDATES
రామ్‌చరణ్ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతున్న `రంగస్థలం` మూవీ అతని కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. నటనపరంగా అద్భుతంగా చేశాడు. ఇలాంటి పాత్ర తనకు మళ్లీ వస్తుందో రాదో మరి. పాక్షికంగా చెవుడు ఉన్న యువకుడిలా చెర్రీ ఒదిగిపోయాడు. గుబురు గడ్డం, గళ్ల లుంగీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తన ఇమేజ్ను పక్కన పెట్టి.. పక్కా కమర్షియల్‌కు భిన్నంగా ఇందులో చిట్టిబాబు పాత్ర చేశాడు. ఇక రామలక్ష్మిగా నటించిన సమంత పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. ముఖ్యంగా ‘యేరు శెనగ మీద’ సాంగ్,… `రంగమ్మ మంగమ్మ…` పాటలో తను చక్కటి హావభావాలను పలికించింది. ఆది పినిశెట్టి పద్దతి కలిగిన కుర్రాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక జగపతిబాబు ప్రెసిడెంట్ పాత్రలో ఓవర్ డైలాగ్స్ లేకుండా పరిధి మేర నటించాడు. ఇక అజయ్ ఘోష్, ప్రకాశ్ రాజ్, కాదంబరి కిరణ్, సత్య, నరేశ్, రోహిణి సహా అందరూ వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు సుకుమార్ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా.. పాత్రలను మలుచుకున్న తీరు.. వాటి అనుగుణంగా సన్నివేశాల చిత్రీకరణ… సంభాషణలు.. పాత్రల నుండే కామెడీని పండించేలా సీన్స్‌ను రాసుకోవడం వంటి విషయాల్లో సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. ఆరు పాటల్లో నాలుగు పాటలు చాలా బావున్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంది. ఇక నేపథ్య సంగీతం సూపర్బ్.
రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. ఇక సినిమాకు రామకృష్ణ, మోనికల ఆర్ట్ వర్క్ వెన్నెముకలా నిలబడింది. 1980 నాటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం వెనుక ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం తెరపై కనపడింది. అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేసేశారు కళా దర్శకులు. ఇక సినిమా ఎక్కువ భాగం స్లో నెరేషన్‌లోనే ఉంది. సినిమా మూడు గంటల సినిమా.. స్లోనెరేషన్ అనేది ప్రధానమైన మైనస్ పాయింట్స్. ఇక ఊర్లో ఉండే చిట్టిబాబుకి రంగమ్మత్త చెప్పే వరకు ఆ ఊరి ప్రజలను ప్రెసిడెంట్ చంపేశాడని తెలియకపోవడం.. వారేదో ప్రమాదవశాత్తు చనిపోయారనుకోవడం నప్పదు. ఊర్లోనే చనిపోయిన రంగమ్మత్త భర్త గురించి ఊరి ప్రజలకు తెలియకపోవడం ఏంటో.. ఊర్లోని చనిపోయిన భర్త దుబాయ్‌కి వెళ్లినట్లు ఆమె చెప్పడమేంటో అర్థం కాదు. సినిమా మొదలయిన పదిహేను నిమిషాలకే ప్రేక్షకుడు 1980 బ్యాక్డ్రాప్లోకి వెళ్లిపోతాడు. అందుకు కారణం.. ఆర్ట్ వర్క్, టేకింగ్. ముఖ్యంగా రామ్‌చరణ్‌కు పాక్షికంగా వినపడదు.. దాన్ని అతను కవర్ చేసుకునే విధానం.. దాని వల్ల అతను పడే తిప్పలు.. ప్రేక్షకుడిని నవ్విస్తాయి. ఆది పినిశెట్టిని చరణ్ కాపాడే ఫైట్ అంతగా మెప్పించలేకపోయింది. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే శాడ్ సాంగ్ .. పాట చిత్రీకరణ తెలుగు ప్రేక్షకుడికి అంతగా నచ్చకపోవచ్చు. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తమిళ వాసన ఎక్కువగా కనపడుతుంది. ఇక కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఎక్కడా కనపడదు. రామ్‌చరణ్.. సమంతతో తన ప్రేమను చెప్పే విధానం… రామ్‌చరణ్, ఆది పినిశెట్టిలు జగపతిబాబు ఇంటికి వెళ్లి అప్పటి వరకు తెలియని అతని పేరుని తనకు గుర్తు చేయడం.. క్లైమాక్స్‌లో అసలు చిక్కుముడి వీడటం. వంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా…..`రంగస్థలం`…. పాత కథతో కొత్త ప్రయత్నం( సినిమాను 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడం)
RATING:4/5.