pralayam.com

ముంబయి: టీ20 ఫార్మాట్‌లో రాణిస్తున్న ఎడమచేతి వాటం యువ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ వన్డేల్లోనూ అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రపంచకప్‌ జట్టులో ఆడాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌, శ్రీలంకతో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ఎంపికైన అతడు జట్టుతో కలిసి శ్రీలంక బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడాడు.

జింబాబ్వేతో 2016లో జరిగిన టీ20లో అరంగేట్రం చేసిన ఉనద్కత్‌ ఏడాది తర్వాత డిసెంబర్‌లో శ్రీలంక సిరీస్‌లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. తాజా దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు నిదాస్ టీ20 ట్రోఫీకి ఎంపికయ్యాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో చోటు దక్కించుకోవాలని కోరుకుంటున్నాడు.

‘వన్డేల్లోకి అడుగుపెట్టేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. నైపుణ్యం ప్రదర్శిస్తే జట్టు మేనేజ్‌మెంట్‌, సారథి మద్దతు లభిస్తుంది. ‌గతంలో శ్రీలంకతో ఆడిన అనుభవం ఉంది. అదే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. అప్పుడూ టీ20లే ఆడాను. ఇప్పుడు ఆడేదీ టీ20లే. అప్పుడు ఆడిన వారే ఉంటారు కాబట్టి వారికి అనుగుణంగా ప్రణాళికలు రచించి అమలు చేస్తాను’ అని జయదేవ్‌ అన్నాడు.

‘ఈ ముక్కోణపు సిరీస్ నాకో మంచి అవకాశం. ఇప్పటికే కొన్ని సిరీస్‌లు ఆడాను కాబట్టి జట్టులో కుదురుకోగలిగాను. అంతర్జాతీయ స్థాయిలో నా నైపుణ్యాలు ప్రదర్శిస్తాననే విశ్వాసం కలిగింది. దక్షిణాఫ్రికా సిరీస్‌ నేను నేర్చుకోవడానికి పాఠం లాంటింది. అక్కడి వికెట్లు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ బౌలింగ్‌ చేసిన అనుభవం పనికొస్తుంది’ అని ఉనద్కత్‌ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here