pralayam.com

తెలంగాణ ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణలో ప్రస్తుతం తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు కేసీఆర్. రాష్ట్రంలో గులాబీ బాస్ కు ఎదురే లేదని చెప్పొచ్చు. అలాంటి కేసీఆర్.. ‘’ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వైపు చూస్తున్నారా? సీఎం నుంచి పీఎం స్థాయికి ఎదగాలని భావిస్తున్నారా? సీఎం కేసీఆర్.. 7 రేస్ కోర్స్ రోడ్ పై కన్నేశారా? ‘’ మాటల మాంత్రికుడిగా గుర్తింపు ఉన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ తర్వాత ఈ సందేహాలే కలుగుతున్నాయి.

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ (తృతీయ కూటమి) ఏర్పడాల్సిన అవసరం ఉంది అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగక పోరాడి విజయం సాధించి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు తానే నాయకత్వం వహిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ మాటలను విశ్లేషిస్తే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆయన మనసులోని కోరిక కనిపిస్తోందని పొలిటకల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

“జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నేను సిద్ధమే. సమీప భవిష్యత్తులో జాతీయ రాజకీయ పరిస్థితులు మారనున్నాయి. మార్పును తీసుకొచ్చే బాధ్యతను నా భుజాలపై వేసుకునేందుకు సిద్ధం. మరో మూడు నాలుగేళ్లలో మార్పు వస్తుంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తీరు చూస్తుంటే.. ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని పెంచినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా రైతులకు మద్దతు ధర, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం, విభజన హామీల అమలు తదితరాల్లో కేంద్రం తీరుని కేసీఆర్ ఏకిపారేస్తున్నారు.

ఇక కేసీఆర్ ఇప్పటికే తమిళనాడులోని డీఎంకేతో పాటు సమాజ్ వాదీ పార్టీ, జేడీ (ఎస్) తదితరాలతో చర్చిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్డుపై ఆయన కన్నేశారని, ప్రధానమంత్రి పదవిని అలంకరించాలన్న కోరిక ఆయనలో ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన ప్రత్యర్థి చంద్రబాబుతోనూ మాట్లాడతానని కేసీఆర్ చెప్పారని, కాలం కలిసొస్తే, తృతీయ కూటమిలోకి తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ వంటి పార్టీలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ప్రజల దీవెన ఉంటే వంద శాతం భారత రాజకీయాలకు అద్భుతమైన దశా దిశా చూపించి, ఈ దేశ ప్రజానీకానికి మార్గ నిర్దేశనం చేస్తానని సీఎం కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. అటువంటి పని ఈ దేశానికి జరగాలి, లేకపోతే, ఈ దేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారాయన.

నేను ఏదో ఆషామాషీగా, అవగాహన లేకుండా ఈ మాట చెప్పటం లేదని, నిజమైన ఫెడరల్ వ్యవస్థ ఆవిర్భవించాలని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు జరగాలన్నారు. కేంద్రం గుప్పిట్లో సంపూర్ణ అధికారాలు ఉండాలన్నది భవిష్యత్తులో ఇకపై సాధ్యం కాదన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తెలంగాణ నుంచే ప్రారంభమవుతుందని, దేశ వ్యాప్తంగా అందరినీ కూడగట్టుకుని ముందడుగు వేస్తామని, త్వరలోనే భావ సారూప్య పార్టీలు, వ్యక్తులను కలుపుకుని చర్చలు జరుపుతామని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతుల గురించి ఆలోచించే పరిస్థితి దేశంలో లేదని, ఆ పరిస్థితి మారాలని కేసీఆర్ అన్నారు. ఇప్పటిదాకా, అన్నం పెట్టే రైతులకు ఎవరు సాయం చేశారు? వ్యవసాయం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుంటే కనీసం పట్టించుకునే నాథుడు లేడు, పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చినప్పుడు రైతులకు పెట్టుబడి ఎందుకు ఇవ్వరు? విప్లవాత్మకమైన ధోరణితో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం’ అని కేసీఆర్ అన్నారు.

నీటి వాటాల పంపిణీలో అలవికాని జాప్యం జరుగుతోందని, ‘చాటలో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టుగా ఉంది’ అని సీఎం కేసీఆర్ విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం పరిష్కారానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 14 ఏళ్లు తీసుకుందని విమర్శించారు.

అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయి కానీ, రైతులు పండించే ధాన్యానికి ధరలు మాత్రం పెరగవని కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలతో జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయని, నరేగా కూలీలకు ఢిల్లీలో చెల్లింపులు జరపడం, ప్రజాస్వామ్యమా? ఇందుకు సరైన ఉదాహరణ ‘ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన’ అని అన్నారు. ఆరు లక్షల గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ప్రధానికి ఏం సంబంధం? ఢిల్లీలో పెత్తనం పెట్టుకుని తమాషాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎందుకు జరగాలని ప్రశ్నించారు.? జీవితాంతం వాళ్లు చెప్పే కథలు వినాల్సిందేనా..? అని కేసీఆర్ నిలదీశారు.

ఇక థర్డ్ ఫ్రంట్ పై తాను చేసిన వ్యాఖ్యలపై దేశం నలుమూలల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారని, తమ్ముడు కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని మమతా అభినందించారని కేసీఆర్ చెప్పారు. జార్ఖండ్ మాజీ సీఎం ఫోన్ చేసి మీ వెంటే నడుస్తామని చెప్పారని కేసీఆర్ తెలిపారు. ఇక ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిపోయారని, థర్డ్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని ఓవైసీ వ్యాఖ్యానించారు. థర్డ్ ఫ్రంట్ విషయంలో తాను కేసీఆర్ కు పూర్తి మద్దతిస్తున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here